వాడినేది అడిగేది... వాడినేది కోరేది...

కోరికల చెరలోనున్న కైకేయి మాటలకు కానలకు పోయినాడు... వాడినేది అడిగేది... 

తరుణి అని ఘోర తాటకిని చంప వెనుకంజ వేసినాడు... వాడినేది కోరేది...

విశృంఖల వాలికి వరములిచ్చి వరియించినాడు... వాడినేది అడిగేది. 

తాగుబోతు మాటలకు తనను నమ్మిన ఆలినీ విడిచినాడు... వాడినేది కోరేది...

వర గర్వమున విర్రవీగిన రావణుడికి మోక్షమిచ్చినాడు... వాడినేది అడిగేది...

జానకిని రక్షింప జూసిన జటాయువుని రక్షించలేనివాడు... వాడినేది కోరేది... 


దీనిని "నిందాస్తుతి" అంటారు. ఇదేమి కొత్త ప్రక్రియ కాదు. రామదాసు కీర్తనల్లో "ఇక్ష్వాకుకుల తిలకా..." అనే పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన "ఆది భిక్షువు వాడినేది అడిగేది..." పాట ఇదే కోవలోకి వస్తాయి. 


వాళ్లంతా మహానుభావులు. వాళ్లంత పరిజ్ఞానం లేకపోయినా నాకు తెలిసిన రామాయణంలోని కొన్ని ఘటనల ఆధారంగా రాసింది ఈ నిందాస్తుతి. 

ఈ నిందా స్తుతి ఒక విచిత్రమైన ప్రక్రియ. పైకి నిందిస్తున్నట్టు ఉన్నా, నిందించే సమయంలో కూడా దైవ నామ స్మరణ చేసుకోవడం దీని లక్షణం. ఇక్కడ దేవుడ్ని నిందించడం ఉద్దేశం కాదు.

ఈ రోజు ఉదయం ఏదో మాటల మధ్యలో సిరివెన్నెల గారి "ఆది భిక్షువు వాడినేది అడిగేది..." పాట స్ఫురణకు తీసుకొని వచ్చారు ఒక మంచి మిత్రులు. అది రాముడు గురించి మాట్లాడుకునే సందర్భంలో వచ్చింది. రాముడి కృప వలన అనుకున్నదే తడవుగా ఈ ఆరు వరుసలు కుదిరాయి. 

పైన చేర్చిన వరుసలు అన్ని వాల్మీకి రామాయణంలో ప్రస్తుతించిన సంఘటనల ఆధారంగా రాసినవే. ఇప్పుడు ఒకొక్క వరుస చూద్దాం.

"కోరికల చెరలోనున్న కైకేయి మాటలకు కానలకు పోయినాడు... వాడినేది అడిగేది..."

ఇది చాలా ప్రసిద్ధమైన, రామాయణ గాధలో అతి ముఖ్య సందర్భాలలో ఒకటి. కైకేయి వరములు కోరుకునే సందర్భం. ఆ కోరికల వలనే రాముడు అడవులకు వెళ్ళాడు అని అందరికీ తెలిసిందే.

కోరికల చెరలోనున్న కైకేయి అని రాయడానికి ఒక కారణం ఉంది. ఆవిడ మంధర చెప్పిన మాటలు విని రెండు కోరికల మధ్యలో చిక్కుకుని పోయింది. అందుకే అక్కడ కోరికల చెర అని రాయడం జరిగింది.

"తరుణి అని ఘోర తాటకిని చంప వెనుకంజ వేసినాడు... వాడినేది కోరేది..."

తరుణి అంటే స్త్రీ అని అర్థం. విశ్వామిత్ర మహర్షితో కలిసి యాగ సంరక్షణ కోసం వెళ్ళే సందర్భంలో తాటకి ఎదురు పడుతుంది. అక్కడ రాముడు తాటకి స్త్రీ అని, స్త్రీలని చంపవచ్చే అనే సందిగ్ధంలో ఉంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధర్మ సందేహాన్ని నివృత్తి చేస్తూ, అమాయక ప్రజలను హింసించే వారితో పోరాటం చేసేటప్పుడు లింగ బేధాలు వర్తించవు అని చెప్పి తాటకిని సంహరించే లాగా చేస్తారు. పై వరుస ఆ సందర్భం లోనిది.

"విశృంఖల వాలికి వరములిచ్చి వరియించినాడు... వాడినేది అడిగేది..."

వాలికి ఒక వరం ఉంది. తన ఎదురుగా నుంచుని యుద్ధం చేసేటప్పుడు ఎదుటి వారి శక్తిలో సగం కోల్పోతారు. అందుకే వాలి తన సొంత తమ్ముడు అయిన సుగ్రీవుడిని కూడా ద్వంద్వ యుద్ధానికి పిలిచి ఓడించి రాజ్యం తీసేసుకున్నాడు. ఇది అధర్మం. ఎందుకు అంటే, యుద్ధం సమఉజ్జీల మధ్య జరగాలి. కానీ వాలి వరం వల్ల ఎదుటి వ్యక్తికి వాలికి ఉన్నంత బలం ఉండదు. 

ఇది తెలిసి కూడా వాలిని చెట్టు చాటు నుంచి చంపిన కారణంగా వాలిని ఒక వరం కోరుకోమన్నాడు రాముడు. అప్పుడు వాలి తన సహజ స్వభావం వల్ల "నేను నీ చేతిలో ఎలా చెనిపోతున్నానో, నువ్వు కూడా అలాగే చేనిపోవాలి" అని కోరుకుంటాడు. (అది కృష్ణావతారంలో తీరుతుంది).

"తాగుబోతు మాటలకు తనను నమ్మిన ఆలినీ విడిచినాడు... వాడినేది కోరేది..."

ఇది అందరికీ సుపరిచతమే. తాగుబోతు వాడు ఏదో అన్నాడు అని సీతా దేవిని వదిలేశాడు అని.

"వర గర్వమున విర్రవీగిన రావణుడికి మోక్షమిచ్చినాడు... వాడినేది అడిగేది..."

రావణుడు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనే వర గర్వముతోనే సీతను అపహరించాడు. అలాంటి రావణుడికి తన చేతిలో చనిపోయే భాగ్యం, తన చేతిలో చనిపోవడం వల్ల మోక్షం కల్పించాడు.

"జానకిని రక్షింప జూసిన జటాయువుని రక్షించలేనివాడు... వాడినేది కోరేది..."

ఇది కూడా తెలిసిన కథే. జటాయువు సీతా దేవిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోతాడు. 


పైన ఉన్న వరుసలన్నింటిలో "వాడినేది అడిగేది...", "వాడినేది కోరేది..." అని ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది. కానీ అక్కడ రాముడిని ప్రశ్నించడం ఉద్దేశం కాదు, ఆ వరుసల వెనుక ఉన్న నిగూఢ ధర్మ సూక్ష్మాలు గురించి ఆలోచింప చేయడానికి ఒక సాధనం ఆ పదాలు. అంతే. 

*జై శ్రీ రామ్* 🙏

Comments

Popular posts from this blog

The Gandhari within us...

Virtual classrooms - Are they sustainable?

Indian Job Market - Emerging need for skills